Nepal Plane Crash: ల్యాండింగ్‌కు 10 సెకన్ల ముందు కూలిన విమానం.. 72 మంది మృతి

Kaburulu

Kaburulu Desk

January 15, 2023 | 05:03 PM

Nepal Plane Crash: ల్యాండింగ్‌కు 10 సెకన్ల ముందు కూలిన విమానం.. 72 మంది మృతి

Nepal Plane Crash: నేపాల్ లో ఘోర ప్రమాదం సంభవించింది. నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఖట్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 72 మంది ఉన్నారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన విమానం కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు వ్యాపించడంతో చూస్తుండగానే విమానం కాలిపోయింది.

విమానంలోని 72 మంది మృతదేహాలను బయటకు తీశామని విమానయాన అధికారులు తెలిపారు. విమానంలో 53 మంది నేపాలీలు, ఆరుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్స్, ఇరిస్, అర్జెంటీనా, ప్రెంచ్ దేశాలకు చెందిన ఒక్కొక్కరుగా ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు విమానం గంటకు 500 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. విమానం మరో 10 లేదా 20 సెకన్లలో ల్యాండ్ అవ్వబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు.

 

విమానం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు చెబుతుండగా విమానం కూలిపోయే క్షణాల ముందు తీసిన వీడియో క్లిప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో.. విమానం మధ్య గాలిలో బ్యాలెన్స్ కోల్పోయి, పెద్ద శబ్ధంతో నేలకు కూలినట్లు కనిపించింది. మరో క్లిప్‌లో కూలిపోయిన విమానం నుంచి పొగలు రావడంతో భారీ మంటలు కనిపిస్తున్నాయి.

ప్రమాదం తర్వాత కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పాత దేశీయ విమానాశ్రయాన్ని మూసేశారు. పోఖరా విమానాశ్రయానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సేతీ నది సమీపంలో విమానం కూలిపోయింది. 120 మంది రేంజర్లు, దాదాపు 180 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొని విమానంలో చెలరేగిన మంటలు ఆర్పారు. అయితే.. అప్పటికే జరగాల్సిన సంపూర్ణ ప్రాణ నష్టం జరిగిపోయింది. గత ఏడాది మేలో జరిగిన ఓ ప్రమాదంలో 22మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ఇలా ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన సేవలు అత్యంత దారుణంగా ఉన్న దేశాల్లో నేపాల్​ ఒకటి కాగా.. ఏటా ఇలా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా మార్పు కనిపించకపోవడం విడ్డూరం.