Kerala: షాకింగ్.. బిర్యానీ వలన యువతి మృతి.. అసలేం జరిగిందంటే?

Kaburulu

Kaburulu Desk

January 7, 2023 | 10:00 PM

Kerala: షాకింగ్.. బిర్యానీ వలన యువతి మృతి.. అసలేం జరిగిందంటే?

Kerala: కేరళలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీనే కనిపిస్తుంది. ఎన్నో సంస్థలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫుడ్ డెలివరీలలో ఎక్కువ శాతం బిర్యానీనే కనిపిస్తుంది. ఫుడ్ డెలివరీ సంస్థలు నిర్వహించే సర్వేలలో కూడా ఈ బిర్యానీ ఎక్కువ ఆర్డర్లుగా రికార్డులు సృష్టిస్తుంది. అయితే.. బిర్యానీ తిన్న ఓ యువతి మృతి చెందింది.

కేరళలోని కాసర్గోడ్కు చెందిన 20 ఏళ్ల యువతి 2022 డిసెంబర్ 31న ఓ ప్రముఖ రెస్టారెంట్ కు చెందిన కుజిమంతి బిర్యానీనీ ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అయితే అది తిన్న తర్వాత ఆ యువతి అస్వస్థతకు గురవగా.. కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఆమెను కర్ణాటక మంగళూరులోని మరొక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందగా.. యువతి తల్లిదండ్రులు రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఫుడ్ పాయిజనింగ్ తోనే ఆ యువతి మరణించినట్లు నిర్ధారణకి వచ్చిన పోలీసులు హోటల్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి హోటల్ యాజమాన్యంపై ఆ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో నిరసనకారుల నుండి వారిని రక్షించడానికి ముందుగా నివారణ నిర్బంధంలో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు కాసరగోడ్ పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకోవడానికి మహిళ పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా, కొట్టాయం మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తున్న మరో మహిళ కూడా కోజికోడ్లోని ఓ రెస్టారెంట్లో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి ఆమె సైతం ఫుడ్ పాయిజన్ తో చనిపోయింది. వారం వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో ఇక్కడి ప్రజలు హోటల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ నిర్వాహాకుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించగా.. ఫుడ్ సెఫ్టీ అధికారులు కేరళలోని పలు రెస్టారెంట్లలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.