Same-Sex marriage: 15 ఏళ్ల ప్రేమ మాది.. మా పెళ్లికి అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన గే జంట!

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 09:20 AM

Same-Sex marriage: 15 ఏళ్ల ప్రేమ మాది.. మా పెళ్లికి అనుమతివ్వండి.. సుప్రీంకోర్టును కోరిన గే జంట!

Same-Sex marriage: మనుషులంతా ఒక్కటే అని చెప్పుకొనేందుకు అందంగా ఉంటుంది కానీ.. ఆచరణలో నేటికీ ఒక యుద్ధమే నడుస్తుంది. గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పట్ల నేటికీ సమాజంలో చులకన భావం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మేము అలా పుట్టడం మా తప్పు కాదు అని.. తమకీ అన్ని హక్కులున్నాయని వాళ్ళు పోరాటం చేయాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే సమాజంలో వీరి పట్ల కాస్త మార్పు కనిపిస్తుంది. వారు కూడా ఈ సమాజంలో భాగస్వాములే అనే ఆలోచన వస్తోంది.

కానీ ఎక్కువశాతం మంది మాత్రం వారిపట్ల చులకన భావం చూపిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వారి పట్ల వివక్ష ఉంది. వారిని కన్నవారే వెలేస్తున్న దుస్థితి ఉంది. అందుకే మాకు కూడా ఓ తోడు కావాలని ఆకాంక్షించే గే, ట్రాన్స్‌జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వాళ్ళ పెళ్లిళ్లను అధికారికంగా గుర్తించాలని కూడా కోరుతున్నారు. ఇలా తమ గే వివాహాలను చట్టబద్ధం చేయాలని ఇప్పటికే మూడు జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు మరో జంట కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.

గత 15 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని, పెళ్లికి అనుమతించాలని ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు యువకులు సుప్రీంకోర్టును కోరారు. విదేశాల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ స్కాలర్‌గా విద్యాభ్యాసం చేస్తున్న వీరు.. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఉత్కర్స్, కోటియాలు 2008 నుంచి ప్రేమలో ఉండగా భారత్‌లో స్వలింగసంపర్కానికి ఆమోదం లేకపోవడంతో ప్రజల దృక్పథాలు ఎలా మారతాయో? అని వేచిచూశామని ఈ జంట తమ పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, ఉత్తర్ష్, కోటియాల కంటే ముందు గే వివాహాలను చట్టబద్దత చేయాలని మరో ముగ్గురు కూడా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. మొత్తాన్ని కలిపి మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఒకవేళ ఈ వివాహాలకు సుప్రీంకోర్టు కనుక చట్టబద్ధత లభిస్తే.. తైవాన్‌ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్‌ నిలుస్తుంది. మరి సుప్రీం తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.