BRS: సభకు 100 ఎకరాలు.. పార్కింగ్‌కు 400 ఎకరాలు.. బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

Kaburulu

Kaburulu Desk

January 16, 2023 | 03:02 PM

BRS: సభకు 100 ఎకరాలు.. పార్కింగ్‌కు 400 ఎకరాలు.. బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు!

BRS: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలతో ప్రజలలోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్న సీఎం కేసీఆర్.. మరోవైపు తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నలుగురు ముఖ్యమంత్రులు హాజరయ్యే ఈ సభకు దేశం మెచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభకు రెండు రోజుల ముందు నుంచే భారీ కటౌట్లు, హోర్డింగ్ లతో ఖమ్మం గులాబిమయమైంది. ఈ సభతో దేశ రాజకీయాలు మలుపుతిరుగుతాయని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు.

మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా సుమారు వంద ఎకరాలలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక బహిరంగసభకు భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా.. మొత్తం సభా ప్రాంగణం పరిసరప్రాంతాల్లో సుమారు 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని10 నియోజకవర్గాలు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 8 నియోజకవర్గాల నుంచి.. వేలాది వాహనాల్లో కార్యకర్తలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సభకు 30,000 నుంచి 50,0000 వాహనాలు వస్తాయని అంచనావేస్తుండగా పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు. ఇక సభా ప్రాంగణం దగ్గరలో 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యంతో పాటు సభా వేదిక ఎదురుగా వీఐపీల కోసం 20 వేల కుర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్స్, పది లక్షల వాటర్ ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.