Tuljapur:తుల్జాపూర్ లో కొలువైన భవానిమాత దేవాలయంలో జరిగే ఈ సంఘటన గురించి విన్నారా?

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 10:36 PM

Tuljapur:తుల్జాపూర్ లో కొలువైన భవానిమాత దేవాలయంలో జరిగే ఈ సంఘటన గురించి విన్నారా?

మహారాష్ట్రలోని సోలాపూర్ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్ లో వెలసిన భవాని మాత ఆలయంలో జరిగే ప్రత్యేక ఆసక్తికరమైనటువంటి కొన్ని సంఘటనలు మనలను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఆ పండుగలు ఏమిటో, ఆ కార్యక్రమాలు ఏమిటో, ఆ ఆసక్తికరమైనటువంటి సంఘటనలేమిటో ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి…!
ముందుగా ఈ ఆలయ చరిత్రను గురించి తెలుసుకున్నట్లైతే ఆలయాన్ని గురించిన సమాచారం స్కాంద పురాణంలో వివరించబడింది, ఇందులోని ఇతిహాస కథనం ప్రకారం, ఈ ప్రాంతంలో నివసించిన కర్దం అనే ఋషి మరణానంతరం అతని భార్య “అనుభూతి” నది ఒడ్డున కూర్చొని భవానీ మాత కోసం తపస్సు చేసింది. ఆ సమయంలో “కుకుర్” అనే పేరుతో ఒక రాక్షసుడు ఆమెను హింసించాడు. అప్పుడు భవాని దేవి అనుభూతిని రక్షించి రాక్షసుడిని సంహరించింది. తర్వాత “బాలా ఘాట్” కొండపై స్థిరపడింది. అప్పటి నుండి ఈ భవాని మాతను తుల్జా భవాని అని పిలవడం ప్రారంభించారు.
ఇక ఈ ఆలయంలో జరిగే ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రుల పూజల తర్వాత చివరి రోజైన దసరా పండుగ నాడు దేవత మూర్తికి పూజలు నిర్వహించి ఒక మంచం పై మూర్తి విగ్రహాన్ని విశ్రాంతి తీసుకునే విధంగా పడుకోబెడతారు. ఈ విధంగా బాగా పూజలందుకున్న దేవతామూర్తి నాలుగు రోజుల పాటు నిద్రలో మునిగిపోతుంది. అలా నిద్రిస్తున్న భవానీ మాతను తమ పుట్టింటి వారిగా పిలవబడే వారు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చి ఆమెను నిద్రనుండి మేలుకొలిపే ప్రయత్నం చేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ విగ్రహం లేచి కూర్చుంటుంది. వెంబడే విగ్రహం ముందు ఉన్నటువంటి చిన్నపాటి గుడిసె కాలిపోతుంది. ఈ సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఆ కాలిపోయినటువంటి గుడిసె యొక్క బూడిదను అందుకోవడానికి భక్తులు తారాటపడుతుంటారు. ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాల తర్వాత వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఈ సంఘటన జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా…!