Thulasi: తులసి మొక్కను పూజించే క్రమంలో ఈ పద్ధతులను పాటిస్తున్నారా…?

Kaburulu

Kaburulu Desk

December 23, 2022 | 09:55 PM

Thulasi: తులసి మొక్కను పూజించే క్రమంలో ఈ పద్ధతులను పాటిస్తున్నారా…?

ఇంటింటా తులసి మొక్క ఉండటం అనేది హిందూ సనాతన ధర్మంలో ఒక సంప్రదాయపరమైన ఆచారంగా ఉంది. ఇంటిముందు తులసిమొక్కను ఉంచేటపుడు తులసి మొక్క దగ్గర ఎప్పుడూ చెత్త లేదా మురికి ఉండకూడదు. తులసి మొక్క నాటిన ప్రదేశంలో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దలు సూచించారు. తులసి మొక్క వద్ద శుభ్రంగా లేని ఇళ్లలో పాజిటివ్ ఎనర్జీ ఉండక పూజా ఫలితాలు లభించవని శాస్త్రాలు చెబుతున్నాయి.

తులసి మొక్కను నిత్యం పూజించే వారు ఇంట్లో మాంసం, మద్యం సేవించకూడదు. తులసి మొక్క ఉన్న ఇంట్లో స్త్రీలను ఎప్పుడూ అవమానించరాదు, స్త్రీలను శక్తి స్వరూపిణిగా భావించి గౌరవించాలి. లేదంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించదట. తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ ముళ్ల మొక్కలను నాటవద్దు. వాస్తులో ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన కుటుంబంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుంది. దీనిని శాస్త్రీయ పరమైన కోణంలో ఆలోచిస్తే తులసి మొక్క చుట్టూ ఉండే ముళ్ళ పొదలు అక్కడి నేలలో ఉన్నటువంటి సారాన్నంతా తీసుకుంటుంది. తద్వారా తులసి మొక్కకు కావాల్సిన పోషకాలు అందవు.

వాస్తు ప్రకారం, తులసి మొక్కను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. తులసి మొక్కను ఈ దిశలో ఉంచడం వల్ల సానుకూల శక్తి.. సుఖ సంపదలు లభిస్తాయి. తులసి మొక్క దగ్గర ఎంగిలి పాత్రలు లేదా చెప్పులు, బూట్లు ఎప్పుడూ ఉంచకూడదు. అలా చేయడం వలన అక్కడికి కీడును కలిగించే క్రిమికీటకాలు వంటివి చేరి, అక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.