Started Nagoba Jathara: ప్రారంభమైన ఆదివాసీల నాగోబా జాతర…. ప్రత్యేకతలేంటో తెలుసా…?

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిందే నాగోబా జాతర. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవుడు.
ఈరోజు నుంచి అత్యంత ఘనంగా ప్రారంభమయింది. గంగా జలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర.. ఆద్యంతం గిరిజన సంప్రదాయాల నడుమ అత్యంత వైభవంగా జరుగుతుంది. పుష్యమాసపు అమావాస్య అర్ధరాత్రి ఆదిలాబాద్ లోని కేస్లాపూర్‌లో దేదీప్యమానమైన వెలుగుల మధ్య ఈ జాతర మొదలయింది. చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా దేవాలయాన్ని ప్రారంభం, విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమం 2022 డిసెంబరు 19న వైభవంగా జరిగింది. ఆదివాసీ గిరిజన పురోహితుల మంత్రోచ్ఛారణల నడుమ మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి నూతనంగా నిర్మించిన దేవాలయంలోని గర్భగుడిలో నాగోబా విగ్రహాన్ని, సతీక్‌దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. దేవాలయ శిఖరాలపై కలశాలను ఏర్పాటుచేశారు.