Shaligram Stones: నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామ శిలలు… వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 07:13 PM

Shaligram Stones: నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామ శిలలు… వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీతారాముల విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలను నేపాల్ నుండి అయోధ్యకు తరలించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌ వారు సాలిగ్రామ శిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలను అయోధ్యకు చేర్చారు. నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువున్న రెండు సాలిగ్రామ రాతి ఫలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు.

ఈ భారీ శిలలకు పూజలు జరిపి, మమూల విగ్రహాలను తయారు చేస్తారు. శాలిగ్రామ శిలలు 6కోట్ల సంవత్సరాల నాటివని భక్తుల బలమైన విశ్వాసం. నేపాల్‌ నుంచి అయోధ్యకు తీసుకొచ్చే మార్గంలో ఈ శిలలకు భక్తులు పూజలు చేశారు. పలు చోట్ల ఘనస్వాగతం కూడా పలికారు. శ్రీ విష్ణువు అవతారంగా సాలిగ్రామ శిలలను హిందువులు భావిస్తారు. నేపాల్‍లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి.

హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది. 33 రకాల శిలాజాలతో ఈ సాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ శిలలు 6కోట్ల ఏళ్ల నాటివనే నమ్మకం ఉంది. ఈ సంవత్సరం ముగిసే లోపే ముందే సాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం సిద్ధం చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా సాలిగ్రామ శిలతో తయారు చేయనున్నారు. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారు.