Sambara Polamamba Jatara Celebrations in Sambarapura: సంబరపురాలో ప్రారంభమైన శ్రీ శంబర పోలమాంబ జాతర…!

ఉత్తరాంధ్రప్రదేశ్ లో కొలువుతీరిన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఈరోజు వైభవంగా ప్రారంభమైంది. జాతరలో భాగంగా నిర్వహించే సిరిమానోత్సవంను వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా పోటెత్తారు. మరి ఈ జాతర విశేషాలేమిటో, జాతరలో జరిగే వివిధ కార్యక్రమాలు ఏమిటో, వారి ఆచారాలు ఏమిటో, ప్రత్యేకతలేమిటో ఇపుడు తెలుసుకుందాం.
ప్రతి ఏటా శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో గల సంబరపురాలో సంక్రాంతి వెళ్లిన మొదటి వారం నుంచి పది వారాల వరకు జరుగుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా ఈ జాతరకు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
ఈ జాతరలో ప్రధాన ఘట్టాలు: తొలేళ్ల ఉత్సవం, సిరిమానోత్సవం, అంపక ఉత్సవం. ఈ ఉత్సవాలను వీక్షించడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఇవాళ జాతరలోని ప్రధాన ఘట్టమైన సిరిమాను సంబరం సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచిత దర్శనంతో పాటు పది రూపాయల క్యూ లైన్లు, 50 రూపాయల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.