Rat Temple:ఎలుకలకు పెట్టే నైవేద్యమే దైవ ప్రసాదం… ఎక్కడో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 10:47 PM

Rat Temple:ఎలుకలకు పెట్టే నైవేద్యమే దైవ ప్రసాదం… ఎక్కడో తెలుసా?

సనాతన హిందూ సంప్రాదాయంలో అనేక జంతువులను దేవుళ్ళ వాహనాలుగా పరిగణిస్తూ వాటిని గౌరవించే ఆచారం ఉంది. ఉదాహరణకు దుర్గామాతకు పెద్దపులి, సరస్వతి దేవికి హంస, శివుడికి నంది మొదలైన ముక్కోటి దేవతలందరికీ ఏదో ఒక జంతువు వాహనంగా ఉంటుంది. అలానే విజ్ఞాలను తొలగించే వినాయకుడికి వాహనం మూషికం (ఎలుక). మరి ఈ ఎలుకలకు కూడా ఒక ప్రత్యేక దేవాలయం ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు?… తెలుసుకోండి మరి…

రాజస్థాన్ లోని బికనీర్ నగరానికి 32కి.మీ.ల దూరంలో ఉన్న దేశ్నోక్ గ్రామంలో గల మాతా కర్ణి ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని వేల సంఖ్యలో ఉన్న అక్కడి ఎలుకలు ఆరగిస్తాయి. ఈ ఎలుకల దర్శనం చేసుకోడానికి అనేక చోట్ల నుండి భక్తులు తరలివస్తుంటారు. ఇక్కడి అనేక ఎలుకల్లో ఎవరికైనా తెల్ల ఎలుక కనిపిస్తే వారు అదృష్టం చేసుకున్నట్టని భక్తులు విశ్వసిస్తారు.

ఈ ఆలయంలోని ఎలుకలను భక్తులు కాబా అని పిలుస్తారు. ఇక ఇక్కడి ప్రధాన దైవం విషయానికొస్తే, కర్ణి మాత అవతారం సుమారు 650 సంవత్సరాల క్రితం జరిగిందని స్థానికుల విశ్వాసం. ఇక్కడి చరణ్ కుటుంబంలో రిధుబాయి అనే అమ్మాయిగా కర్ణి మాత జన్మించిందని అమ్మవారి ఆలయంలో పూజలు కూడా ఈ కుటుంబం వారే నిర్వహిస్తారని భక్తులు చెబుతారు. ఈ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే కాబాలో ఒకరుగా జన్మిస్తారని, లేదా కాబాలో ఏదైనా ఎలుక మరణిస్తే తిరిగి చరణ్ కుటుంబంలో జన్మిస్తారని స్థానిక ప్రజలు చెబుతారు.