Bhadrachalam:భద్రాచలంలో నూతన పూజా విధానాలు

దక్షిణ భారతదేశ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని భద్రాచల రామయాలయంలో పలు కొత్త పూజా కార్యక్రమాలను తీసుకొస్తున్నట్టు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ ఆలయ పూజా విధానాలలో గల మార్పులేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదివేయండి ఈ వ్యాసం…
నిత్య సర్వ కైంకర్య సేవ, నిత్య పుష్పాలంకరణ సేవ, శ్రీరామనవమి ముత్యాల సమర్పణ, వేద ఆశీర్వచనం, తులసి దండ అలంకరణ, తులాభారం అనే కొత్త పూజా విధానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. ఈ పూజా విధానాలు ఆలయ ఆదాయం పెంచడంతో పాటు, భక్తులకు అధిక సమయం దైవ దర్శనం చేసుకునేందుకు అవకాశం కలిగిస్తాయని తెలిపారు. ఈ పూజా విధానాలపట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే భక్తులు వారంరోజుల్లోగా రాతపూర్వక అభ్యంతర పత్రాలు సమర్పించాలని ఈవో ప్రకటించారు.
ఉదయం, సాయంత్రం నిర్వహించే సేవ ‘నిత్య సర్వ కైంకర్య సేవ’ దీనికొరకు 5వేల రూపాయల టికెట్ ను నిర్ణయించడం జరిగింది. అన్నీ సదుపాయాలతో శ్రీ రామ నవమి కళ్యాణ ఉత్సవం కొరకు ‘ముత్యాల సమర్పణ సేవ’ ధర 108 రూపాయలుగా నిర్ణయించారు. ‘వేద ఆశీర్వచనం’ టికెట్ ధర 500 రూ. గా నిర్ణయించి దీనికి ఉదయం 9 నుండి 11 గంటల మధ్య సమయాన్ని కేటాయించారు. ‘తులసి దండ అలంకరణ సేవ’ ప్రతి శనివారం ఉదయం 7గం.లకు ఉండనుంది. దీని ధర 100రూ.లు గా నిర్ణయించారు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి మద్యాహ్నం 1గం.ల వరకు మళ్ళీ తిరిగి 3గం.ల నుండి సాయంత్రం 8గం.ల వరకు ‘తులాభారం’ సేవను నిర్వహించనున్నారు. దీని టికెట్టు 100 రూ.లుగా నిర్ణయించారు.