Banned Mobiles at Temples:ఆ రాష్ట్రంలోని ఆలయాల్లో ఫోన్లు నిషేధం…!

Kaburulu

Kaburulu Desk

December 8, 2022 | 10:52 PM

Banned Mobiles at Temples:ఆ రాష్ట్రంలోని ఆలయాల్లో ఫోన్లు నిషేధం…!

ప్రతీ మనిషికీ సెల్ ఫోన్ తప్పనిసరైన నేటి రోజుల్లో ప్రజలు ఫోన్ లేకుండా జీవించలేకపోతున్నారు. పొద్దున నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తమతమ ఫోన్లతోనే జీవనం గడుపుతుంది నేటి సమాజం. అలారం రూపంలో నిద్రలేపుతూ, వాట్సాప్ అప్డేట్స్ చూస్తూ నిద్ర పుచ్చుతూ, కోడి కూతగా, అమ్మ లాలిపాటగా అన్నీ సెల్ ఫోనే అయిన నేటి రోజుల్లో కనీసం ఆధ్యాత్మిక చింతనలో దేవాలయానికి వెళ్లినప్పుడైనా ఫోన్ కి దూరంగా ఉండాలని మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

తమిళనాడు వ్యాప్తంగా దేవాలయాల్లో సెల్ ఫోన్ అనుమతిని నిషేధిస్తూ ప్రతీ ఆలయం దగ్గర సెల్ ఫోన్లు భద్రపరిచే లాకర్లు ఉంచాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి వేసిన పిటిషన్ను అంగీకరిస్తూ దేవాలయాల భద్రతా విషయాలను కాపాడేందుకు, ప్రశాంతమైన పరిసరాలను ప్రార్థనా స్థలాల్లో అనుభవించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆలయాల్లో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం వంటివి ఆలయ ఆగమశాస్త్రాల ప్రకారం తప్పుడు పని అని భావించిన సుబ్రహ్మణ్య స్వామి ఈ పిటిషన్ను వేసినట్టు తెలిపాడు. దేవాలయాల సందర్శనార్థం వచ్చిన అనేక మంది మహిళలు వారి అనుమతి లేకుండానే వారి ఫోటోలు తీసుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కూడా తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.