Lingaraja Temple:త్రిభువనేశ్వర అనే పేరు గల శివలింగం ఎక్కడుందో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 28, 2022 | 03:23 PM

Lingaraja Temple:త్రిభువనేశ్వర అనే పేరు గల శివలింగం ఎక్కడుందో తెలుసా…?

దేవాలయాలు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. అటువంటి దేవాలయాల్లో కొన్ని మాత్రమే కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందులో ఒకటి త్రిభువనేశ్వరుడు కొలువై ఉన్న ఒడిశాలో గల లింగరాజస్వామి దేవాలయం. ఈ ఆలయం ఒడిశా రాజధాని నగరమైన భువనేశ్వర్ లో ఉంది. మరి ఈ ఆలయ విశేషాలేంటో, ఆలయ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇపుడు తెలుసుకుందాం.

లింగరాజ అనగా లింగాలకు రాజు అని అర్థం. ఈ ఆలయంలోని శివలింగానికి త్రిభువనేశ్వర అనే పేరు ఉంది. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు పూర్వం సోమవంశి రాజులచే నిర్మించబడిందని ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు ఆలయం వద్ద ఉన్న శిలాశాసనాల ద్వారా లభ్యమవుతున్నాయి. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోనే అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది.

పాశ్చాత్య చరిత్రకారుడు జేమ్స్‌ పెర్గుసన్‌ ఈ ఆలయాన్ని సందర్శించి దీని వైభవాన్ని కీర్తించడం విశిష్టమైన విషయం. ఈ చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని కొన్ని గొప్ప హిందూ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఒడిశా సంప్రదాయ రీతిలో సమున్నతమైన గోపుర నిర్మాణం ఈ ఆలయానికి ఎంతో శోభను కల్పిస్తుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు..