Lingampally Ellamma Jathara: ప్రారంభమైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర…! నోటికి తాళంవేసే సంప్రదాయం ఉన్న ఈ జాతర విశేషాలేంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 09:24 PM

Lingampally Ellamma Jathara: ప్రారంభమైన లింగంపల్లి ఎల్లమ్మ జాతర…! నోటికి తాళంవేసే సంప్రదాయం ఉన్న ఈ జాతర విశేషాలేంటో తెలుసా…?

భాగవత పురాణం ప్రకారం క్షత్రియుడైన పరుశరాముడు తన తల్లి అయిన రేణుక ఎల్లమ్మ కు తపస్సు చేసుకోడానికి వెళ్లిన తండ్రి జమదగ్ని జాడ తెలుపమని అడుగుతాడు. ఎంత వేడుకున్నా ఎల్లమ్మ తన భర్త జాడ చెప్పకపొవడంతో కోపోధ్రిక్తుడైన పరుశరాముడు తన గండ్ర గొడ్డలితో తన తల్లి ఎల్లమ్మ తలను చేధిస్తాడు. తదనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి తల ఈ లింగంపల్లి ప్రాంతంలో వచ్చి పడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ప్రాంత విశేషాలేమిటో ఇపుడు తెలుసుకుందాం.

నారాయణపేట జిల్లా లోని నారాయణపేట మండలానికి చెందిన లింగంపల్లి అనే గ్రామంలో ఈ జాతర ఈ రోజు ప్రారంభమైంది. ఈ ఆలయాన్ని కొల్లంపల్లి గ్రామానికి చెందిన భక్తులు నిర్మించారు. ఈ జాతర జరుపుకోడానికి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి మొదలైన రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చారు. ఈ గ్రామానికి కొంత దూరంలో ఉన్న జాజాపూర్, నారాయణపేట ప్రాంతాల్లో కూడా ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో కూడా ఈ జాతర ఐదు వారాల పాటు జరుపుతారు.

జాతరలో ప్రధాన ఘట్టం మొదటి మంగళవారం పెద్ద బోనంకుండ ఊరేగింపును విశేషంగా నిర్వహించడం ఇక్కడి భక్తుల ఆనవాయితి. ముఖ్యంగా అమ్మవారి భక్తురాలైన సాయమ్మ నోటికి తాళం వేసే ఘట్టం అత్యంత ప్రసిద్ధి చెందింది. గవ్వల దండను సాయమ్మ మెడలో వేసి ముఖానికి బొట్లు పెట్టి నోటికి తాళం వేసి దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేయిస్తారు. పెద్ద బోనం కుండ తిరిగే సమయంలోనే చిన్న పిల్లలకు బండారు (పసుపు) వేస్తే మళ్లీ ఏడాది వరకు ఏ విధమైన వ్యాధులు వ్యాపించవనేది భక్తుల నమ్మకం.