Swamy Vivekananda: స్వామి వివేకానందుడి మార్గం స్వర్ణ భారతికి సాధన మంత్రం…!

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 07:58 PM

Swamy Vivekananda: స్వామి వివేకానందుడి మార్గం స్వర్ణ భారతికి సాధన మంత్రం…!

నరేంద్ర నాథ్ దత్తగా పిలువబడిన స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడుగా ప్రసిద్ధి చెందాడు. ‘హిందువుగా జీవించు హిందువునని గర్వించు’ అని చాటి చెప్పి, 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడి 161 జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం…

వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్త్వ శాస్త్రములోనే కాకుండా, సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో ‘జీవుడే దేవుడు’ అనేది అతని మంత్రముగా మారింది. ‘దరిద్ర నారాయణ సేవ’ (పేదవారి సేవతో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించి ప్రత్యేక ఆధ్యాత్మిక వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. “విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?” అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతిలో కలిసి పోతాయని తెలుసుకున్నాడు.

స్వామి వివేకానంద ఒక ఆధ్యాత్మికవేత్తనే కాకుండా, మనోవిజ్ఞాన వేత్తగా, ఒక ప్రోత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా తన మాటలతో ఎందరికో మార్గ నిర్దేశం చేశాడు. అందులో మచ్చుకు కొన్ని కింది ఇవ్వడం జరిగింది.

  • గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగృతులు కండి.
  • ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.
  • మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.
  • మందలో ఉండకు ..వందలో ఉండటానికి ప్రయత్నించు..
  • ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు..

వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఎందరో మహానుభావులు నేటి తరంలో ఉన్నత వ్యక్తులుగా స్థిరపడుతున్నారు. మన భారతం స్వర్ణ భారతం అవ్వడానికి వివేకానందుడి మార్గంలో అందరమూ నడవాలని సంకల్పించుకుందాం.