First Pallava Temple built on rock:రాతి మీద నిర్మించిన తొలి పల్లవ ఆలయం ఏదో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 18, 2022 | 03:43 PM

First Pallava Temple built on rock:రాతి మీద నిర్మించిన తొలి పల్లవ ఆలయం ఏదో తెలుసా…?

శాతవాహనులతో సామంతులుగా ఉండి క్రమంగా స్వతంత్ర్య రాజ్యం ఏర్పర్చుకున్న పల్లవులు అనేక శిల్పసంపదను మనకు అందించారు. పల్లవుల రాజధానిగా పిలువబడే కాంచీపురం ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ క్షేత్రంలోని కైలాసనాథ దేవాలయాన్నే పల్లవులు రాతి మీద నిర్మించిన తొలి దేవాలయంగా చెబుతారు. ఈ ఆలయం గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఇపుడు తెలుసుకుందాం.

పల్లవులు ఈ ఆలయాన్ని క్రీ.శ. 567 వ సంవత్సరంలో నిర్మించారు. ఆ తర్వాత ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రెండో నరసింహ వర్మ ఈ ఆలయాన్ని విస్తరించి ఇంకా అభివృద్ధి చేసారు. ఈ ఆలయం ఆరు వందల పరిపాలనా కాలంలో ఎందరో పల్లవ రాజులు నిర్మింప చేసిన అనేక ఆలయాల్లో ప్రస్తుతం నిలిచి ఉన్న పురాతన కొన్ని ఆలయాల్లో ఇదీ ఒకటి. ఇది రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలతో నిర్మించినవే. అయితే ఈ ఆలయాన్ని మాత్రం మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఇసుక రాతితో చెక్కడం విశేషం.

పల్లవ నిర్మాణ శైలిని కలిగి ఉన్న ఈ ఆలయం వెలుపలి ప్రాకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. ప్రధాన ఆలయం మాత్రం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది.