Difference between Graha, Vigraha and Prathima:గ్రహం – విగ్రహం – ప్రతిమల మధ్య తేడా ఏంటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

December 13, 2022 | 10:22 PM

Difference between Graha, Vigraha and Prathima:గ్రహం – విగ్రహం – ప్రతిమల మధ్య తేడా ఏంటో తెలుసా…?

గ్రహం అంటే సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలు అని, విగ్రహం అంటే దేవాలయంలో ప్రతిష్టించిన మూర్తి అని, ప్రతిమ అంటే కూడళ్ళలో ఏర్పాటుచేసిన దేశ నాయకుల లేదా రాజకీయ నాయకుల బొమ్మలు అని మనకు అందరికీ తెలుసు. కానీ ఒక్కో పదం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటో వాటి యొక్క నిగూఢార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా గ్రహం. గ్రహం అంటే గ్రహించేది అని అర్థం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం లేదా ఖగోళ విజ్ఞానం ప్రకారం గ్రహం అంటే గ్రహించేది. గ్రహించడం అంటే మంచినైనా గ్రహించవచ్చు చెడునైనా గ్రహించవచ్చు అలాగే మంచినైనా ఇవ్వవచ్చు. ఉదాహరణకు భూ గ్రహానికి అయస్కాంత శక్తి ఉంది. అంటే పైకి విసిరిన ఏదైనా ఒక వస్తువును మళ్ళీ తన ఆకర్షణ బలంతో కిందికి గ్రహిస్తుంది, అంటే ఆకర్షిస్తుంది. అదేవిధంగా అన్ని గ్రహాలకు ఈ శక్తి ఉండకపోవచ్చు కానీ గ్రహాలన్నీ ఏదో ఒక దాన్ని గ్రహించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహాల తారుమారు వలన అనేకమైనటువంటి కీడు జరగవచ్చు లేదా మంచే జరగవచ్చు మొత్తం మీద గ్రహం అంటే గ్రహించేది అని అర్థము.
అలాగే రెండవది విగ్రహం. విగ్రహం అంటే విశిష్టమైన దానిని గ్రహించి విశిష్టమైన దానిని ఇచ్చేది అని అర్థం. పలు విషయాలలో కొన్ని విషయాలు మాత్రమే లేదా పలు అంశాలలో కొన్ని అంశాలు మాత్రమే విశిష్టమైనవి, అద్భుతమైనవి, మంచి కలిగించేవిగా ఉంటాయి. వాటిని మాత్రమే గ్రహించి తమ దగ్గర ఉంచుకొని అవసరమైనప్పుడు బయటికి ఇచ్చేవి విగ్రహాలు. మనం నిత్యం దేవాలయాలలో చూసే దేవతామూర్తులను విగ్రహం అని పిలుస్తూ ఉంటాము. అంటే విగ్రహం అనేది మంచిని గ్రహించి మంచిని మనకు అందిస్తుంది ఎలా అంటే వాతావరణంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని గ్రహించి తమ ముందు నిలబడ్డటువంటి భక్తులకు లేదా వ్యక్తులకు ఆ విగ్రహం అందజేస్తుంది.
ఇక మూడవది ప్రతిమ. ప్రతిమ అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు లేదా జంతువు యొక్క ప్రతిరూపమే ప్రతిమ. సాధారణంగా కూడళ్లలో నిలబెట్టేటటువంటి రాజకీయ నాయకుల లేదా దేశ నాయకుల యొక్క బొమ్మలను ప్రతిమలుగా చెప్పవచ్చు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయమేమంటే దేవాలయంలో ప్రతిష్టించక ముందు దానిని మనం ప్రతిమ గానే భావించాలి. ఎప్పుడైతే ఆగమశాస్త్రాల ప్రకారం దేవాలయం యొక్క గర్భగుడిలో ప్రతిమను ప్రతిష్టించాక ప్రతిమ కాస్త విగ్రహంగా మారుతుంది. అంటే విశిష్టమైనదాన్ని గ్రహించుకొని విశిష్టమైన దాన్ని ఇచ్చేదిగా మారుతుంది అని అర్థం. ఇది గ్రహం – విగ్రహం – ప్రతిమ పదాల మధ్య గల తేడా. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ…!