Calendars and Diaries of TTD:టిటిడి వారి క్యాలెండర్లు, డైరీలు ఎలా పొందాలంటే…?

Kaburulu

Kaburulu Desk

December 11, 2022 | 01:32 PM

Calendars and Diaries of TTD:టిటిడి వారి క్యాలెండర్లు, డైరీలు ఎలా పొందాలంటే…?

2023వ సంవత్సరం క్యాలెండర్లను, డైరీలను అందుబాటులోకి తెస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శుభవార్త తెలిపారు. వీటిని కేటాయించిన కొన్ని ఆఫ్లైన్ కేంద్రాలలోనూ, ఆన్లైన్ లోనూ, డిడి ద్వారా కూడా పొందవచ్చని తెలిపారు.

తిరుమలలోని అన్నదాన భవనంలోని పుస్తక విక్రయశాలలతోపాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం వద్దగల ధ్యానమందిరం, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లోనూ క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలతో పాటు నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హనుమకొండలోని టిటిడి కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయి.

క్యాలెండర్ ధరలు 15 నుండి 130 రూపాయల వరకు ఉన్నాయి. డైరీలు 120 నుండి 150 రూపాయల వరకు ఉన్నాయి. ప్రత్యక్షంగా కొనుగోలు చేయలేని భక్తులు ఆన్‌లైన్‌లోనూ tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే డిడి తీసి ”కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి” పేరిట ఏదైనా జాతీయ బ్యాంకు ద్వారా ”ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి” అనే చిరునామాకు పంపి పొందవచ్చని టిటిడి తెలిపింది. టిటిడి వారి క్యాలెండర్‌, డైరీలకు సంబంధించిన ఇతర సమాచారం కోసం 9963955585, 0877-2264209 నంబర్లను సంప్రదించవచ్చు.