Brahmotsavam Celebrations At Jogulamba Temple: అలంపూరులో బ్రహ్మోత్సవాలు… ఈ నెల 26న జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 10:31 PM

Brahmotsavam Celebrations At Jogulamba Temple: అలంపూరులో బ్రహ్మోత్సవాలు… ఈ నెల 26న జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం

అష్టాదశ శక్తిపీఠాలో ఒకటైన అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరగబోయే బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత ఏంటో, అక్కడి సాంప్రదాయం, ఆచారాలను గురించి, బ్రహ్మోత్సవాల సమయసారిణి గురించి ఇపుడు తెలుసుకుందాం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవదిగా, తెలంగాణలో ఏకైక శక్తి పీఠంగా, దక్షిణ కాశీగా ప్రాచుర్యం పొందిన అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వరస్వామి, జోగులాంబ అమ్మవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈనెల 26 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. రజాకార్ల సమయంలో జోగులాంబ అమ్మవారి మూలవిరాట్టును బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ఉంచి, 2005లో వసంత పంచమిరోజున కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతియేటా వసంత పంచమికి ఐదు రోజులు ముందు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి 18 వ వార్షిక బ్రహ్మోత్సవాలను గణపతి పూజ, పుణ్యాహవాచనం, రిత్విక్ వరణం, మహా కలశ స్థాపన, యాగశాల ప్రవేశంతో ప్రారంభించారు.

గతంలో వసంత పంచమి రోజున వెయ్యి కళశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించేవారు. కానీ ఈసారి ఐదు రోజులపాటు వెయ్యి కళశాలతో నిత్యం పూజా కార్యక్రమాలు చేసి అభిషేకం చేస్తారు. ఇక చివరిరోజైన ఈ నెల 26వ తేదీన అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించనున్నారు. ఆ తర్వాత అమ్మవారు భక్తులకు నిజరూప దర్శనమిస్తారని ఆలయ ఈవో, అర్చకులు తెలిపారు. అమ్మవారు ఎలాంటి బంగారు ఆభరణాలు పూలదండలు లేకుండా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని పేర్కొన్నారు.