Kotappakonda Tirunallu: కోటప్పకొండ తిరునాళ్ళు ఎప్పుడో… ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 10:48 AM

Kotappakonda Tirunallu: కోటప్పకొండ తిరునాళ్ళు ఎప్పుడో… ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటో తెలుసా…?

కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుడి పుణ్యక్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. మరి ఈ ఏడాది తిరునాళ్ళ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఇపుడు తెలుసుకుందాం.

కోటప్పకొండ తిరునాళ్లను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో మేడారం తర్వాత జరిగే అతిపెద్ద జాతరగా కోటప్పకొండకు పేరుంది. కోటప్పకొండను ఏపీ ప్రభుత్వం స్టేట్‌ ఫెస్టివల్‌గా ప్రకటించడంతో ఉత్సవాలు భారీస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి కోటప్పకొండ తిరునాళ్లు ప్రారంభం కానున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కోటప్పకొండలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.

యల్లమంద దగ్గర బ్రిడ్జి నిర్మాణం, కొండకు నలువైపులా రూట్‌మ్యాప్స్‌, భక్తులకు క్యూ లైన్స్‌, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం విద్యుత్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖతోపాటు ఆలయ కమిటీతో భేటీ అయ్యారు ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి. గతేడాది కన్నా ఈ సారి 20 లక్షల మంది భక్తులు కోటప్పకొండకు తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా క్యూలైన్‌లో నిల్చునే భక్తులకు నీరు, ఇతర సౌకర్యాలు, త్వరగా దర్శనమయ్యేవిధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఇక శివరాత్రి రోజు కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా మంచి దర్శనం చేయించడమే అందరి ధ్యేయంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి.