Aksharabhyasam at Basara: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర క్షేత్రం… నేటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 11:22 AM

Aksharabhyasam at Basara: భక్తులతో కిటకిటలాడుతున్న బాసర క్షేత్రం… నేటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా…?

నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం, బాసరలో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇవాళ పుష్యమి నక్షత్రం, పూర్ణిమ, ఆదివారం సెలవు కావడంతో తెల్లవారు జామునుండే భక్తులతో బాసర ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి.

అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్ర నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేలాదిగా తరలి వచ్చారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, శ్రీకర, కుంకుమార్చన పూజలు జరిపించారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జనం తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల అమ్మవారి దర్శనానికి ఆలస్యం అవుతోంది. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.