Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూడా అన్న ఎన్టీఆర్ గారిలాగే.. ఆయనలాగే సినిమాలు చేయాలి.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

September 7, 2022 | 12:39 PM

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూడా అన్న ఎన్టీఆర్ గారిలాగే.. ఆయనలాగే సినిమాలు చేయాలి.. పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యలు..

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఒప్పుకున్నా రాజకీయాలతో బిజీ ఉండటంతో షూటింగ్స్ కి డేట్స్ ఇవ్వట్లేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా తీయాలని అంతా కోరుకుంటున్నారు. ఇటీవలే పవన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. తాజాగా ప్రముఖ రచయిత గోపాలకృష్ణ ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు.

పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్ లో ఓ ఛానల్ నిర్వహిస్తూ అందులో తనదైన రీతిలో సినిమాల గురించి మాట్లాడుతుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ వీడియో తీశారు. ఈ వీడియోలో పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ”పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఆయన పుట్టిన రోజుని జరుపుకున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వరుస సక్సెస్ లు చూశారు, ఆ తర్వాత ఫెయిల్యూర్స్ చూశారు. ఇటీవల మళ్ళీ కొత్త కొత్త సినిమాలతో వస్తున్నారు. అయితే ఆయన రాజకీయాల వల్ల సినిమాలు అంత త్వరగా చేయట్లేదు.”

”గతంలో చాలా మంది సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్లంతా ఏదో ఒక పార్టీలో చేరి సీటు కోసమో, పదవి కోసమో వచ్చిన వాళ్ళే. కానీ పవన్ అలా కాదు. ఆయన జనాలకి ఏదో చేయాలనే ఆశయంతో వచ్చారు. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ గారు కూడా అలాగే జనాల కోసం ముందుకొచ్చారు. ఇప్పుడు పవన్ కూడా. ఎన్టీఆర్ గారు ఎవరు తనకి తోడు వచ్చినా, రాకపోయినా ముందుకి వెళ్లారు. పవన్ కూడా తనతో ఎవరు కలిసి వచ్చినా, రాకపోయినా ముందుకి వెళ్లారు. పవన్ చట్టసభల్లోకి వెళ్లి, ప్రజల వాయిస్ ని వినిపించాలి. కాకపోతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేముందు సినిమాలు కూడా చేశారు. అవి ఆయన రాజకీయ కెరీర్ కి ఉపయోగపడ్డాయి. పవన్ కూడా ఎలక్షన్స్ ముందు సినిమాలు రిలీజ్ చేయాలి. సినిమాలతో జనాల్లోకి మరింత చొచ్చుకెళ్లాలి. పవన్ ఈ సారి గెలవాలి అని కోరుకుంటున్నాను” అని తెలిపారు. దీంతో పరుచూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అభిమానులు కూడా పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. మరి పవన్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలని ఎలక్షన్స్ ముందే పూర్తి చేస్తారేమో చూడాలి.