Norovirus: కేరళలో నోరా వైరస్ కలకలం.. స్కూల్స్ బంద్.. తల్లిదండ్రులకు టెస్టులు!

Kaburulu

Kaburulu Desk

January 23, 2023 | 09:35 PM

Norovirus: కేరళలో నోరా వైరస్ కలకలం.. స్కూల్స్ బంద్.. తల్లిదండ్రులకు టెస్టులు!

Norovirus: ఒకపక్క కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్‌లు ప్రజలపై విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తుండగానే.. భారత్​లో మరోసారి నోరో వైరస్ కలకలం సృష్టించింది. కేరళ ఎర్నాకులం జిల్లాలోని కక్కానాడ్​లో ఇద్దరు ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు నోరో వైరస్ పాజిటివ్ గా తేలింది. ఈ స్కూల్ లో చదువుతున్న మొత్తం 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించడంతో నోరో వైరస్​ అన్న అనుమానంతో నమూనాలను ల్యాబ్​కు పంపించంగా అందులో ఇద్దరికి పాజిటివ్ గా​ నిర్ధారణ అయింది.

వ్యాధి సోకిన ఇద్దరు విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాల సమాచారం. అయితే, పాజిటివ్ గా తేలిన విద్యార్థులు చదివే స్కూల్ లో వైరస్​ వ్యాపించకుండా మూడు రోజుల పాటు మూసివేసినట్లు ప్రకటించారు. స్కూల్ లో చదివే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా వైరస్​ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్న అధికారులు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

డయేరియా రోటా మాదిరిగానే ఈ నోరా వైరస్ కూడా ఇతరులకు వ్యాపిస్తుందని.. అజాగ్రత్త వహిస్తే ప్రాణాలను హరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నోరో వైరస్‌ను స్టమక్ ఫ్లూ, స్టమక్ బగ్ అని కూడా పిలుస్తారు. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణముండగా.. ఇది అన్ని వయస్సుల వారికి సోకుతుంది. ఇది కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాల కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది.

ఈ వైరస్ సోకిన వారికి 12 నుంచి 48 గంటల్లో దాని లక్షణాలు కనిపించనుండగా.. మూడు రోజుల వరకు ఈ లక్షణాలు ఉంటాయి. విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, వికారం, జర్వం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. వైరస్ బారినపడిన వ్యక్తుల మలం, వాంతిలో దీని ఆనవాలు కనిపిస్తుంది. నోరో వైరస్ బారినపడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం కూడా దీని వ్యాప్తికి దోహదం చేస్తుంది. మలం నుంచి సేకరించిన నమూనాల పరీక్షించడం ద్వారా ఈ వైరస్ ను నిర్ధరిస్తారని నిపుణులు చెప్తున్నారు.