Minister Roja: 40 ఏళ్ల ఇండస్ట్రీ 40 మంది బలి.. చంద్రబాబుపై రోజా ఫైర్

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 04:41 PM

Minister Roja: 40 ఏళ్ల ఇండస్ట్రీ 40 మంది బలి.. చంద్రబాబుపై రోజా ఫైర్

Minister Roja: పవన్ నోటికి చంద్రబాబు హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? ఒకపక్క చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నా.. పవన్ ఎందుకు నోరు మెదపడంలేదని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ప్రశ్నించారు. సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన రోజా.. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు.

అప్పుడు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని.. ఇప్పుడు కందుకూరు, గుంటూరులో 11 మందిని బలి తీసుకున్నాడని.. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 40 మందిని పొట్టనబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుడు మాటలను వినే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని.. చంద్రబాబు ఎన్నాళ్ళు తిరిగినా ఇక్కడ చెల్లడని మాట్లాడారు.

ఇక, లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తుండడంపై స్పందించిన రోజా.. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. లోకేశ్ పాదయాత్ర చేస్తే టీడీపీకే నష్టమని.. అందుకే లోకేశ్ పాదయాత్ర పట్ల టీడీపీ నేతలే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తపుత్రుడి వెంట కాకుండా దత్తపుత్రుడి వెంట చంద్రబాబు వెళుతున్నాడని లోకేశ్ కూడా కోపంతో ఉన్నాడని రోజా పేర్కొన్నారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అరంగేట్రంపై కూడా స్పందించిన మంత్రి రోజా.. ఎవరు ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చని.. బీఆర్ఎస్ కూడా అలాగే ఇక్కడా పార్టీ పెట్టుకోవచ్చని.. అయితే ముందుగా ఇప్పటికీ పరిష్కారం దొరకని విభజన సమస్యలను పరిష్కరించాలని.. అలాగే చట్టప్రకారం తెలంగాణ నుండి ఏపీకి రావాల్సిన నిధులపై కూడా బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినా చంద్రబాబు ప్రశ్నించలేదని.. ఓటుకి నోటు కేసు అడ్డుపెట్టుకొని ఏపీకి తీరని అన్యాయం చేశాడని రోజా తీవ్ర విమర్శలు చేశారు.